Saturday 8 September 2012

గౌహతి పరాభవం


సాధారణ కుర్రాడి సైకాలజీ - ఒక అమ్మాయిని చూడడం,  అందంగా ఉంటే "అబ్బ ఏముందిరా!" అనుకోవడం ఇంకా అందంగా ఉంటే చంద్రుని మీద నుండి భూమిని చూసిన ఫేస్ పెట్టుకొని కాసేపు ఏదో తెలియని ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడం, ఇంకా అందంగా ఉంటే...... సారీ నాకు అలాంటి వాళ్ళు ఇంకా తగల్లేదు, తగిలాక చెప్తా!

ఏంటి టైటిల్ ఏదో పెట్టి తొక్కలో సైకాలజీ చెప్తున్నా అనుకుంటున్నారా, వస్తున్నావస్తున్నాఅక్కడికే వస్తున్నా...

నిన్న ఏదో బ్లాగ్ సెర్చ్ లో ఉండగా ఒక అమ్మాయి రాసిన పోస్ట్ తగిలింది అదే మొన్న ఆ మధ్య జరిగిన gauhati molestation గురించి, ఏంట్రా దొంగలు పడ్డ ఆర్నెల్లకు అనుకుంటున్నారా. ఏం చేస్తాం బాసు మనకు న్యూస్ చానల్స్ చూసే అలవాటు లేదు. ఒకపుడు చూసేవాణ్ణే  కానీ ఆ తెలంగాణా ఉద్యమం అప్పుడు చూసి, చూసి చిరాకు దొబ్బింది. అబ్బో ఇపుడు దీని గురించి మాట్లాడితే "నీకు తెల్వదు, నువ్ ముయ్!" అని ప్రేమగా బుజ్జగించడానికి నా బాతు బచ్చాలు రెడీగా ఉంటారు. సో, అదన్నమాట! తప్పుడు సమాచారం కంటే అసలు సమాచారం లేకపోవడమే మంచిదని, జన్మలో మళ్లీ న్యూస్ చానల్స్ చూడొద్దని నిర్ణయించుకున్నా. అందువల్ల కరంట్ అఫ్ఫైర్స్ లో మనం కొంచెం వీకు. ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం!

ఇక ఆ సంఘటన గురించి..

దీనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను, భాదపడుతున్నా, అసలు మన సమాజంలో ఇలాంటి నీచులు ఉన్నారా! అనే రొటీన్ డైలాగులు నేను చెప్పను.

ఆ అమ్మాయి రాసిన దాన్లోంచి ఒక ముక్క మీ కోసం 

All that matters is that the girl’s screams and struggling give him a high. Isn’t that what it’s all about? The feeling of power.

పూర్తిగా చదవాలనుకునే వాళ్ళ కోసం ఈ లింక్ 

ఇది చదివాక, ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఆక్రోశిస్తోంది, "అసలేంటి... ఏం జరిగింది, నాకు తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి!" అనుకొని యూటూబ్ లో వీడియో చూసా అంతే దిమ్మ తిరిగింది, చెపితే నమ్మరు కానీ నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే "భయం". తోబుట్టువులున్న ప్రతీ ఒక్కడు అది చూసాక భయపడి తీరుతాడు.

నా కర్మ కొద్దీ ఆ వీడియో న్యూస్ చానల్స్ వాళ్ళు కవర్ చేసింది, వాళ్ళ సొల్లు వాళ్ళది. పోలీసులు ఏం చేస్తున్నారు, మహిళా సంఘాలు ఏం చేసాయి, NGO వాళ్ళు ఎలా ఊర్కున్నారు. ఎంతసేపూ వాడేం పీకాడు, వీడేం పీకాడు అనే కాని మనం ఏం ఈకాం అని ఎవడూ అనడు. విపక్ష నాయకులు అయితే ఇది ప్రభుత్వ వైఫల్యం దీనికి ఒబామా వెంటనే రాజీనామా చేయాలి అని, నిరసనగా బంద్ కూడా !! 

పనికొచ్చేది మాట్లాడేవాళ్ళే కరువయ్యారు ఈ రోజుల్లో! ఓకే వాళ్ళను అరెస్ట్ చేద్దాం ఉరి శిక్షా వేద్దాం కానీ ఇలాంటిది మళ్ళీ జరగదంటారా ? ఎహే మనకెందుకొచ్చిన గోల, మన దగ్గర జరగలే కదా! అనుకుందామా ? మీక్కూడా తెలుసు ఇలాంటివి జరగడానికి ప్లేసులతో సంబంధం లేదని.

అసలు ఎవరు వీళ్ళు, ఇంత దారుణంగా ప్రవర్తించడానికి వీళ్ళకు మనసెలా ఒప్పింది, వీళ్ళేమయినా దుశ్శాసుని కసిన్ బ్రదర్సా అంటే కాదనే చెప్పాలి. 

దీన్లోకి వెళ్ళే ముందు నా చిన్నపుడు మా నానమ్మ చెప్పిన కథ  - 

ఒక రాజు స్వయంవరానికి వెళ్ళి గెలిచి, రాణిని ఇంటికి తీసుకొస్తాడు. హారతి ఇవ్వకుండా లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి బయట ఉండి "అమ్మా! నేను ఏం తెచ్చానో చూడు" అంటడు. దానికి " ఏం తెచ్చినా సరే, మిగతా నీ నలుగురు అన్నదమ్ములతో పంచుకో" అంటుంది వాళ్ళ అమ్మ. 

మీకు సిన్మా అర్ధమయిందని నాకు తెల్సు, ఇంక నేను స్టోరీ జెప్ప....

అయితే, అప్పుడు వాళ్ళు అమ్మ మాట జవదాటలేదు కాబట్టి హీరోలు అని చెప్పారు కానీ తీసుకొచ్చింది కూడా ఒక ఆడదే, ఆమెను అలా పంచుకోవడం కరెక్టేనా అని ఎవరూ చెప్పరు. దానికి తోడు భార్య, భర్త మాట జవదాటకూడదు అనే జస్టిఫికేషన్ లు బోలెడు (పైగా, మన ద్రుపది పతివ్రతాయే...!!!). అన్ని స్టోరీలు మగవాళ్ళకు అనుకూలంగా రాసుకొని, ఆడవాళ్ళని తక్కువ అని చెప్పుకొనే మన సమాజం లో....

ఆగండి, ఆగండి మీకు నన్ను విమర్శించడానికి ఇంకా చాలా టైం ఉంది. అసలు చీర లాగే కార్యక్రమం గురించి నేను మాట్లాడనేలేదు సుమీ !



స్త్రీ స్వేచ్ఛ అని మొత్తుకున్న మహానుభావులు చలం, కందుకూరి లాంటి వాళ్ళు లేకపోలేరు కానీ వినేవాళ్ళు ఎక్కడ? నర నరాల్లో ఆడది తక్కువ అని నూరిపోస్తుంటే.. (ఆగు బదరూ పూర్తిగా చదివి నీ కామెంట్లు వేస్కుందువు గాని...)

బాక్ టు ద పవిలియన్, అసలు ఎవరు వీళ్ళు...

వీళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడలా, మన సమాజంలోని వాళ్ళే, మన కుటుంబ వ్యవస్థ నుండి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కడూ సాధారణ వ్యక్తి లాగానే ఉన్నాడు. కావాలంటే మీరూ చూడండి, ఎవ్వడికీ కొమ్ములు లేవు. (గమనిక: సున్నిత మనస్కులు ఆ వీడియో చూడకపోవడమే మంచిది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ఈ ఉత్తర్వు జారీ చేయడమైంది.)

ఇంతకీ నేను చెప్పోచ్చింది ఏంటంటే,

మన ఇళ్ళల్లో చూపించే gender discrimination మరియు రాణి రుద్రమ్మలు ఈ రోజుల్లో తగ్గిపోవడం 
ఇలాంటి సంఘటనలకి కారణాలు అని నా ఉద్దేశం.

హే, రుద్రమ్మ అంటే ఇంకో ఇస్టోరి గుర్తోచింది... మీరు వద్దు మహాప్రభో అనుకున్నా పర్లేదు నేను చెప్తా !!

నా చిన్నప్పుడు మా ఊళ్ళో డాన్సు ప్రోగ్రాంలు జరుగుతుండేవి, నేనూ వెళ్ళేవాణ్ణి (మా నాన్నగారు ఇంట్లో లేనపుడు). 
ఒకసారి, ఒక అమ్మాయి డాన్సు వేస్తోంది పాట గుర్తు లేదు కానీ అది "అ అంటే అమలాపురం" టైపు పాట. ఇంతలో 
నా పక్కనున్న ఒకడు ఆ అమ్మాయిపై ఒక బీప్ బీప్ కామెంట్ వేసాడు. ఆ పక్కనున్న ఆవిడ అది విని
"ఒరేయ్ బీప్ గా, నువ్ అన్నట్టే నీ అక్కా చెల్లెళ్ళపై వేరే వాళ్ళు కూడా ఇలానే కామెంట్ లు వేస్తార్రా!" అంది. 

(ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు
1. అసలు ఆ అమ్మాయిని అలాంటి పాటకి డాన్సు వేయమని ఎవడు అన్నాడు అనే టైపు 
2. ఇది కొంచెం వెరైటీ టైపు "అసలు ఆ కుర్రాడు ఏం కామెంట్ వేసి ఉంటాడు" అని బుర్ర బద్దలు కొట్టుకొనే వాళ్ళు 
ఈ రెంటినీ, కర్మ రా బాబు అని వదిలేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.)

అంతే వాడి మొహంలో నెత్తురుచుక్క కనపడలేదు, అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అపుడు ఆవిడని చూస్తే రుద్రమ్మని 
చూసినట్టు అనిపించింది. ఆమె అలా అనడం వల్ల వాడు మారాడని నేను చెప్పట్లా, నాలాంటి వాడికి జీవితాంతం 
వెన్నులో వణుకు ఉండేలా చేయగలరు ఇలాంటి వాళ్ళు అని నేను చెప్పేది. అలాంటి వాళ్ళ అవసరం ఈ రోజుల్లో చాలా
ఉంది.

మై డియర్ మెన్, నేనేమి ఆడాళ్ళ తరుపు వకాల్తా పుచ్చుకోలేదు. చప్పట్లు ఒకే చేత్తో కొడతారని చెప్తే నేను కూడా
నమ్మను. ఇక్కడ కేవలం ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా, ఆ వీడియో చూస్తే మీకే అర్ధం అవుద్ది.
మీరు అనుకొనే వాటిపై కూడా చర్చిద్దాం (తర్వాత ఎప్పుడైనా), మనకు పండగే పండగ.

మళ్ళీ బాక్ టు ద పవిలియన్, ఎవరు వీళ్ళు...

ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు "మన ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు ఇలాంటి పని చేస్తే..?" (చెప్పలేం రోజులు అసలే బాలేవు)

చూశారా తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉందో... !! 


“Children are great imitators. So give them something great to imitate.” 
ఏమన్నా అర్ధం అయ్యిందా ? సంతోషం, అర్థం అవ్వకపోతే ఇంకా ఆనందం...

మనం మన ఇంట్లో మన ఆడాళ్ళపై ఎలా ప్రవర్తిస్తామో, మన పిల్లోడికి అదే మనం నేర్పినట్టు లెక్క. ఏదో ఒక బలహీన క్షణంలో మీ ఆవిడ పై చేయి చేస్కున్నారనుకోండి, తిరిగి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టకపోతే... ఇంకేం నాన్నే గ్రేట్, అంటే మగాళ్ళే గ్రేట్ అని వాడు ఫీల్ అవతాడు. ఇలాంటి బీప్ బీప్ గాళ్ళ లాగా అవడని గారంటీ లేదు. ఎందుకొచ్చిన రిస్క్ చెప్పండి. ఎప్పుడూ పుత్రోత్సాహం అని ఒకే ఆంగిల్ లో ఎన్ని రోజులు ఆలోచిస్తారు, పుత్రికోత్సాహం అనేది కూడా ఒకటి ఉంటదని నమ్మండి.

ఇంక ఈ అమ్మాయిలు-అమ్మమ్మల విషయానికొస్తే, వీళ్ళకి ఏమీ జరగనట్టు పోవడం ఉగ్గు పాలతో పెట్టిన విధ్య. ఎవడేమన్నా లైట్ తీస్కుంటారు. నేనేమీ మిమ్మల్ని కత్తులు గట్రా వేస్కొని రోడ్ల పై పడమని చెప్పట్లేదు, టెన్షన్ పడకండి. మీ ఇంట్లో పిల్లాడు పిల్లదానిపై పెత్తనం చలాయిస్తుంటే వాడి చెంపపై లాగి ఒక్కటి పీకి "దేంట్లోరా నువ్ దానికంటే ఎక్కువ" అనండి చాలు.

ఇంక చివరగా శ్రోతల కోరిక మేరకు ఒక పాట...

Respect (పాట యూటూబ్ లో)

ఇంత సొల్లు చదివాక మీకేమైనా తేడా అనిపిస్తే సంతోషం. లేదంటే, మనం ఎన్ని విషయాల్ని లైట్ తీస్కోలేదు ఇదో లెక్కా? అసలే మనం భారతీయులం, లైట్ తీస్కోడం మన జన్మ హక్కు !!!

ఇంక విమర్శకులూ మీరు కుమ్మేస్కోండి....

No comments:

Post a Comment