Tuesday 18 December 2012

మథనం -1

మనఃశాంతి - చందమామ

ఉదయం మూడున్నర,
చుట్టూ లోకం నిద్రపోతున్న వేళ
చంద్రుని వెలుతురుకి బేలనైన వీధిదీపాలు..

నిర్మానుశ్యత..
భయమా ? నిశ్శబ్దతలో రాటుదేలుతున్న
ఆలోచనల పదును కాదంటున్నాయి.
అలికిడి... గాలి సవ్వడి సందేహాస్పదం.
మనఃశాంతి - చందమామ
దూరపు కొండల నునుపు, ఎదుగుదల తపించిన బాల్యం
dylan పాట వినమని అంతరాత్మ ఘోష
ఏం జరిగింది, ఎలా... బేరీజు వేయాలనిపించని అలసత
ఇది ఇంతకముందరే అనుభవించానే !! deja vu
అంధకారాన్ని కౌగిలించానా ? ఏమైంది ??
మరోసారి కమ్ముకున్న ఆలోచనల వెల్లువ
ఓహ్ ! అంతేకదా !!
  అంతేనా? కాదు. ఏదో తేడా, ఎక్కడో పొరబాటు
కలలా తోచిన తడబాటు..
అదే నేరమా? అవునని శపించిన గతం.
భయంకర శబ్దం, దూరాన కుక్కల ఏడుపు
వెన్నులో వణుకు
on-off స్విచ్ లా, చెవికి ఓ మీట ఉంటే బావుండునేమో

వీధి దీపాలు, చంద్రుడూ వెలవెలబోతున్నాయి...
తొలి కిరణాల జాడేది ?
  పాలవాడి అరుపు, మరో ఉదయం
వేచి చూస్తోంది.

Thursday 13 December 2012

మథనం

ప్రేమా? దొరికేదెపుడో
వేచి చూడాలా? తప్పదేమో!
తప్పనిసరా? అవును, బహుశా కాదేమో!
కాదా? ఏ, అయి తీరాలా!
లావా? చల్లారుతుందిలే!
ఓర్పా? ఓదార్పు కన్నా ఇదే నయమేమో!
ఒంటరివా? ఎపుడు కాదు!!!

Sunday 23 September 2012

ఆనందం

ఎక్కడెక్కడ వెతికినా దొరకట్లేదు, ఎన్ని విధాల ప్రయత్నించినా అందట్లేదు, ఎలా ఆలోచించినా తట్టట్లేదు.

'ఇసుకను పిండి నూనె తీయొచ్చు' అని ఎప్పుడో చిన్నపుడు చదివిన పద్యం ఎన్నిసార్లు గుర్తొచ్చినా, ఆత్మారాముడు మాత్రం 'ఇహ మన వల్ల కాదుకని లైట్ తీస్కుందాం' అని చెప్పడం మొదలెట్టి చాలా రోజులైంది. ఇంతదాకా వచ్చింతర్వాత ఇక ఒదిలి పెట్టేది లేదు అని నచ్చజప్తూనే ఉన్నా, వాడు మేల్కొన్నప్పుడల్లా. ఇంకొన్ని రోజులు పోతే వాడి మాటే వినాల్సి వస్తదేమో అనే భయమూ తరుముతోంది. మనవల్ల కానప్పుడు పెద్దల సలహా తీస్కోడం మంచిదేమో అనే ఆలోచనా వచ్చింది కానీ ఎపుడు మనకి నచ్చిందే చేసే అలవాటుని నొప్పించిన వాణ్ని అవుతానేమో అనే ఒక సంకోచం. ఇప్పటికే ఓపిక పీక్స్ దాటుకెళ్ళింది, ఎలా జరగాల్సింది అలా జరుగుద్ది. ఆ పై ఫ్లాట్ లో అశోగ్గాడు ఎలాగూ ఉన్నాడు, మనం నిమిత్త మాత్రులం అనుకొని ఎవరైనా పూజ్యులు, గౌరవనీయుల శరణు కోరదాం అని డిసైడయ్యా. ఇక్కడే వచ్చింది చిక్కు, అలాంటోడు ఒకడూ దొరకందే. హతవిధీ! మళ్ళీ మొదటికొచ్చింది.

హఠాత్తుగా ఒక రోజు ఈ ప్రశ్నకి సమాధానం దొరికినట్టనిపించింది, 

ఆ రోజు శుక్రవారం.. ఉదయాన్నే సూర్యుడు తెల్లగా, మబ్బుల చాటున దాక్కున్నాడు, జ్యోత్స్నను పోలిన వెలుతురు, ధాత్రి తో దోబూచులాడుతూ! ఈ వియోగ భారం ఇక తనోపలేనని మేఘాలపై కన్నెర్ర జేసినట్టుంది, మేఘాల గమనం వేగవంతమైంది, అపుడు సోకిన మయూఖపు నుని వెచ్చని స్పర్శతో తను పులకరించింది. వెంటనే చెట్టుపై ఉన్న కోయిల తన గానం తో ధాత్రీ, వెలుగు రేడు ల సంయోగాన్ని మరింత పావనం చేసింది. 

మీరు ఎక్కడికో పోతున్నట్టున్నారు, మనం మేటర్ లోకి వద్దాం. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, అమ్మ టీవీ లో ఏదో భక్తి ఛానల్ చూస్తోంది. పల్లూడగోట్టుకోడానికి ఏ రాయి అయితేనేం, కాసేపు చూద్దామని కూర్చున్నా, ఏదో ఆశ్రమం గురించి చెప్తున్నారు. ఇదేదో మన సిచువేషన్ కి పనికొచ్చేదున్నట్టుంది అని అడ్రస్ రాస్కుంటుంటే అమ్మ వింతగా చూస్తోంది. బహుశా నాలో సన్యాసి కనపడ్డాడేమో, అలాటిదేమి లేదని నచ్చజెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.

ఇక ఆ ఆదివారం బయల్దేరా, ఫ్రెండ్సుకి చెపితే మొదటికే తేడా వస్తదని చుట్టాల దగ్గరికి అని వాళ్ళకి మస్కా కొట్టి, ఆశ్రమానికి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరం, రా రమ్మన్నట్టుగా. ఆహా! ప్లాస్టిక్ తొట్టి, ప్లాస్టిక్ కుండ, ప్లాస్టిక్ అదీ... ప్లాస్టిక్ ఇదీ.. కాదేది ప్లాస్టిక్ కి అనర్హం అనే విధంగా... ఈ రోజుల్లో మహర్షులుంటే ప్లాస్టిక్ కమండలాలు వాడే వారు కామోసు...!!

వెతగ్గా వెతగ్గా ఒక చెట్టుకింద ధ్యానం చేస్తూ ఒక సాధువు కనపడ్డాడు, అర మీటరు గెడ్డం వేసుకొని. అబ్బో ఈయన మాంచి సహనశీలి, విజ్ఞుడేమో అనుకొని (రెండోది కొంచెం డౌటే కానీ మొదటిది నిజమేనేమో, రెండు సెం.మీ. గెడ్డం పెరిగితేనే చిరాకేస్తది. అలాంటిది అర మీటరు గెడ్డం... మాటలు కాదు సుమీ!) వెళ్లి ఆయన ముందు నించున్నా, ఎపుడు కళ్ళు తెరుస్తడా అని. ఒక అరగంట నిరీక్షణ, ఈయన్ని చూస్తుంటే మన రమణారెడ్డి నే గుర్తుకొచ్చాడు. ఎందుకో తెలియదు దొంగ సాములంటే రేలంగి మంచి సాములంటే రమణారెడ్డి నే గుర్తొస్తారు. (నిత్యానందుని చూస్తే రంజిత గుర్తోస్తదనుకోండి అది వేరే విషయం) 

ఈ తర్క విశ్లేషణ లో ఉండగా ఆయన కళ్ళు తెరిచారు. వెంటనే నేను 'పాహిమాం పాహిమాం !! రక్ష రక్ష' అనేశా వర్డ్స్ రిచ్ గా ఉండాలని నిన్నటి నుండి ప్రాక్టిస్ చేశా మరి, ఆయనేమో ఏమీ అర్ధం కానట్టు 'What do you want, భక్తా' అనేశాడు, ఇంగ్లీషు మీడియం సామి అనుకుంటా. వెంటనే ఏం కావాలో చెప్తే బాగోదని, ఆశ్రమం గురించి ఎలా తెలిసింది ఏ రూట్ లో వచ్చానో చెప్తూ ఉంటే. అవేమి వద్దని ఎందుకొచ్చానో చెప్పమన్నాడు, సామి బాగా బిజీ అనుకుంటా. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని 'Happiness, స్వామి' అనేశా. దానికి ఆయన చిన్నగా నవ్వి ఊర్కున్నాడు, ఏమీ చెప్పకపోయే సరికి నాలో టెన్షన్  మరింత పెరిగింది. ఆయన కాసేపటి తర్వాత 
'There's no such thing as a free lunch, నాయన' అన్నాడు.  
అబ్బో ఈడు మన టైపే ఫ్రీ గా ఏది చేసేట్టు లేడు అంటే సొల్లు చెప్పకుండా ఏదో పనికొచ్చేదే చెప్తాడు. 
'What I have to do for that, స్వామి'
'You need to count the number of leaves this tree has'
'....'
ఇంకేం చచ్చింది గొర్రె, మన వాలకం చూసి మేష్టారుకి అర్దమైంది.
'Otherwise you can pay 5011 Rs as ashrama development fund'

(అవును మరి, మనకు ప్రతి దానిలో డిస్కౌంట్ దొరుకుద్ది. ఇది చేయలేని వాళ్ళు అది చెయ్యొచ్చు, అది చేయలేని వాళ్ళు మరొకటి చెయ్యొచ్చు. ఎన్ని పాపాలు చేసినా ఒకసారి గంగలో మునిగితే చాలు, మళ్ళీ ఫ్రెష్షుగా పాపాలు చేయడం మొదలెట్టొచ్చు.)

ఇంక, నా మొహం లో వెలుగు చూడలేక అయన కళ్ళకి చేతులని అడ్డుపెట్టుకోవలసి వచ్చింది.
'Get me the receipt and I'll give you my wisdom'
వెంటనే లగేత్తుకెళ్ళి, receipt తో ఆయన ముందు నించున్న. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు
'What do you want ?'

'I want happiness'

'Remove I from that, what are you left with ?'

'want happiness'

'Remove want from that, what are you left with ?'

'Happiness'

'that's all my son, You can't take anything with you when you die. Help others like a tree, river then you will find peace in your heart!!'


(చెట్టు, నది గురించి ఏదో శ్లోకం కూడా చెప్పాడు, మనమేమి ఏకసంథాగ్రహులమా గుర్తు ఉండడానికి..?)
ఇహ నాకు కన్నీళ్ళు ఒకటే తక్కువ ఎంత సింపుల్ గా చెప్పేశాడు సామి, అంత గొప్ప విషయాన్ని. ఆయనకు నమస్కరించి ఇంటి దారి పట్టా, సిద్దార్థ నుండి బుద్దుడిగా మారిన ఫీలింగ్ లో...


ఇక్కడ కట్ చేస్తే, మూడు నెలలు గిర్రున తిరిగాయ్.. 

ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం...


మళ్ళీ అదే ఆశ్రమంలోకి అడుగు పెట్టా కాకపోతే నా గెడ్డం 2 సెం.మీ.ల నుండి 2 ఇంచులకి పెరిగింది. ఈసారి నేరుగా ఆ చెట్టు దగ్గరికే వెళ్ళా, సామి అక్కడే ఉన్నాడు ధ్యానంలో. 

అయన లేచేసరికి ఈసారి టైం ఎక్కువే పట్టింది, లేచి నన్ను ఎగాదిగా చూసి 'వాట్ డు యు వాంట్' అన్నాడు మళ్ళీ.
అమ్మ దీనమ్మోయ్, చూసిన సినిమా ఎన్ని సార్లు చుపెడుతావురా నాయన ! అసలే చిరాకెత్తి ఉన్నా.

'డోంట్ యు రెమెంబెర్ మి స్వామి, ఐ వస్ హియర్ త్రీ మొంథ్స్ బ్యాక్'

'ఐ డోంట్, టెల్ మి వాట్ డు యు వాంట్'

అంతే ఇక నాకు ఎక్కడో కాలింది, ఆవేశం కట్టలు తెంచుకుంది. చిన్నప్పటి నుండి విన్న బూతులన్నీ మెదడులో మెదిలాయి.

'నేను తెల్వదా, నీ డాడీ... బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....
'ఆగు నాయనా ఏమిటా తిట్లు, వినలేకున్నా. దైవాంశ సంభూతులను అల తూలనాడడం అమంగళం'
'జఫ్ఫానా జఫడి, ఎందుకు తిట్టొద్దు, ఎట్లా మర్చిపోతావ్ నన్ను! వచ్చీ రాని సోల్లంతా జెప్పి... ఆగాగు... హమ్మ, రాజబాబు రేలంగి. నీకు తెలుగొచ్చా. నీ బీప్....బీప్....బీప్....బీప్....బీప్....'
'ఆగు నాయనా నేను ఒరిజినల్ స్వామినే, అందులో యే సందేహమూ వలదు. నిరూపించడానికి మా గురువు గారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది. పరీక్షించడానికి గెడ్డం పీకాలని మాత్రం చూడకు నాయన, దీని భాద ఇప్పటికే భరించలేకున్నా'
'మరి ఎందుకా ఇంగ్లీషు కటింగులు ఇచ్చావ్ ? తెలుగులోనే ఎందుకు మాటాడలే ?'
'ఏం చెప్పమంటావ్ నాయన, ఈ రోజుల్లో తెలుగు ఎవరికి వొచ్చు. అన్నీ ఇంగ్లీషు మీడియం బాచులే, ఇంగ్లీషు మాట్లాడే స్వాములకు శిష్యుల ఫాలోయింగ్ ఎక్కువ అని ఈ మధ్యే స్పోకెన్ ఇంగ్లీషు ట్యూషన్ జాయిన్ అయ్యా! కెరీర్ లో ఎదగాలంటే ఇప్పుడు ఇంగ్లీషు మస్ట్ కదా!!'
'హుం, మీక్కూడా ఈ భాద తప్పలేదా'
'ఏం చేస్తాం నాయనా, ఇంతకీ నువ్ మళ్ళీ ఎందుకొచ్చినట్టు. ఏమయ్యింది, సంతోషం దొరికిందా..?'
'పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. అంతక ముందర ఉన్న మనశ్శాంతి కూడా లేకుండా పోయింది.'
'జయమాలిని డాన్సులా కాకుండా, అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు నాయనా'
'హా, ఏం చెప్పమంటావ్. మీరు చెప్పినట్టే పరుల హితం కోసం బ్రతికేద్దాం అనుకోని, అందరికీ హెల్ప్ చేస్కుంటూ ఈజీగా లైఫ్ గడిపెయ్యోచ్చు అనుకున్నా. అక్కడే మొదలైంది అసలు సినిమా; ఎవడు డబ్బులు అడిగినా లేదనకుండా, నాదగ్గర లేకున్నా వాళ్ళకి సర్దుబాటు చేశా. దాని వల్ల నాకు ఇప్పటికి మిగిలింది 10 లక్షల అప్పు. మా ఆఫీసులో పనంతా నేనొక్కడినే చేస్తున్నా, ఎవడికీ నో చెప్పలేకపోయేసరికి. రోజుకి 4 గంటలు పడుకోవడం కూడా గగనం అయిపోయింది. ఆమధ్య వరుసగా వారం రోజులు ఆఫీసులోనే పడుకున్నా. ఇంట్లో కాసేపు టీవీ చుద్దామంటే, మా అమ్మ టీవీకి తాళం వేస్కుంది. మళ్ళీ ఏ అఘాయిత్యం చేస్తానో అని. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడ మిస్టేక్ చేశానో'
'అయ్యో నాయన, పరుల కోసం బ్రతకమంటే నీకోసం ఏమీ లేకుండా చేస్కోవడమేనా ?'
'నీ డాడీ! ఎవడు రా రిమూవ్ ఐ అని చెప్పింది, నీ బీప్....బీప్....బీప్....బీప్....'
........................
పాపం, సామికి ఏమనాలో తెలియలా. అలా చూస్తూ నించున్నాడు. నాకే అదోలా అనిపించి
'సారీ స్వామి, ఏదో ఫ్రస్ట్రెషన్ లో. అసలు నాకే తెలియాలి, ఏదో మీకు తెలిసింది చెప్పారు. రిమూవ్ ఐ అన్నప్పుడు, నన్ను తీసేస్తే - నేనే లేనప్పుడు ఆ సంతోషం ఎవడు తీస్కుంటాడు అనే ఆలోచనే నాకు రాలేదు చూడు. అది నా తప్పే. ఎవరికీ తోచింది వాళ్ళు చెప్తారు కానీ మన జీవితంలో మనకి ఏది అవసరమో నిర్ణయం మనదేగా, గుడ్డిగా నమ్మి చేస్తే ఇలానే ఉంటది లెండి.'
సామి రియాక్షన్ ఏదో తేడాగా అనిపించింది. ఏదో చెప్దామనుకున్నట్టు, కానీ ఆగిపోయాడు. మళ్ళీ తిట్లు వినే ఓపిక లేదనుకుంటా. ఇహ అక్కడ చేసేదేమీ లేదని బయటికి వచ్చేసా.

జీవితం మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలానే టైం పట్టింది. అలవాటు పడ్డ జీవులు ఇప్పటికీ వెంట పడుతూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒక రోజు కాఫీ మిషన్ దగ్గర వెలిగింది లైటు, ఇంచుమించుగా జ్ఞానోదయమే. రెండు రోజులుగా ఎంత ట్రై చేసినా సాల్వ్ కాని ప్రాబ్లం, ఎలా చేయాలో తట్టింది. అపుడు ఆ క్షణం, మేఘాల్లో తేలిపోవడం అంటే ఏవిటో అర్ధమయింది.

యురేకా ! నేను కనుక్కున్నా ఆనందానికి కీ.

వినాలని మీకూ ఉందా, అయితే కాస్కోండి.
నువ్వు ఎంత కష్టపడతావో అంత సంతోషం నీకు దొరుకుతది. నమ్మరా ? అయితే మీకు ప్రాక్టికల్స్ అవసరమే.

మీరు ఒక లైన్ లో నించున్నారు, మీ నంబర్ రావడానికి చాలా టైం ఉంది. సడన్ గా మీకు చెప్పుకోలేని చోట దురద పుట్టింది. హ హ హ. అపుడు ఉంటది మీ భాద. ఎలాగోలా ఇంటికి వచ్చో లేక వాష్ రూం కి వెల్లో, మీ పని మీరు కానించినపుడు... అపుడు.... మీ ఆనందం వర్ణనాతీతం. కాదంటారా?

అంటే దురద లేనిది ఆనందం లేదన్నమాట. అయ్యబాబోయ్ నాకేటిది ఫిలాసపీ ఇంత ఒత్తుగా వచ్చేస్తోంది.

కొంతమంది, మేము ఎంత కష్టపడ్డా జీవితానికి సుఖం లేకుండా పోతోంది అని చెప్పే వాళ్ళూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏటంటే
Contradictions do not exist. Whenever you think you are facing a contradiction, check your premises. You will find that one of them is wrong.

అంటే, మీరు మీకు నచ్చినది కాకుండా ఏదో చేస్తే ఎట్టా దొరుకుద్ది ఆనందం?

కొంతమంది మహానుభావులు ఉంటారు, మాకు నచ్చినది చేసినా దొరకట్లే అనే వారు.

అన్నయ్యా, మీకు నచ్చిన హీరోయిన్ నడుము చూసినప్పుడు మాత్రం దొరుకుద్ది కానీ. నచ్చిన పని చేస్తే దొరకదా ? అంటే మీ జీన్స్ లోనే ఏదో తేడా ఉంది, బేసిగ్గా మీది వొళ్లు వంచే తత్వం కాదు. రజినీకాంత్ కూడా చేతులు ఎత్తేస్తాడు మీ విషయంలో, ఇంక నేనెంత.

నాకు తెలిసినంతవరకి ఆనందం కంప్లీట్ గా సెల్ఫిష్ ఫీలింగ్. కాదనేవాడు ఎక్కడైనా పోనీ.

నాది అనుకున్నపుడే దొరికేది సంతోషం. ఉదాహరణగా, అందరికీ తెలిసింది మాటాడుదాం. క్రికెట్ లో ఇండియా గెలిస్తే ఎగిరి గెంతేస్తావే (చూసేవాళ్ళకి వర్తిస్తది), నాది అనే ఫీలింగ్ లేనిదే వొచ్చిందా అది?

ఇంకా ఇలాటివి చాలానే ఉన్నాయి కానీ ఇప్పటికి చాలు, చాలా అయింది నా సొల్లు.


సో, అదన్నమాట. ఇంక ఉంటా, ఆత్మారాముడు ఏదో చెప్పాలని గోల చేస్తున్నాడు.

Saturday 8 September 2012

గౌహతి పరాభవం


సాధారణ కుర్రాడి సైకాలజీ - ఒక అమ్మాయిని చూడడం,  అందంగా ఉంటే "అబ్బ ఏముందిరా!" అనుకోవడం ఇంకా అందంగా ఉంటే చంద్రుని మీద నుండి భూమిని చూసిన ఫేస్ పెట్టుకొని కాసేపు ఏదో తెలియని ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడం, ఇంకా అందంగా ఉంటే...... సారీ నాకు అలాంటి వాళ్ళు ఇంకా తగల్లేదు, తగిలాక చెప్తా!

ఏంటి టైటిల్ ఏదో పెట్టి తొక్కలో సైకాలజీ చెప్తున్నా అనుకుంటున్నారా, వస్తున్నావస్తున్నాఅక్కడికే వస్తున్నా...

నిన్న ఏదో బ్లాగ్ సెర్చ్ లో ఉండగా ఒక అమ్మాయి రాసిన పోస్ట్ తగిలింది అదే మొన్న ఆ మధ్య జరిగిన gauhati molestation గురించి, ఏంట్రా దొంగలు పడ్డ ఆర్నెల్లకు అనుకుంటున్నారా. ఏం చేస్తాం బాసు మనకు న్యూస్ చానల్స్ చూసే అలవాటు లేదు. ఒకపుడు చూసేవాణ్ణే  కానీ ఆ తెలంగాణా ఉద్యమం అప్పుడు చూసి, చూసి చిరాకు దొబ్బింది. అబ్బో ఇపుడు దీని గురించి మాట్లాడితే "నీకు తెల్వదు, నువ్ ముయ్!" అని ప్రేమగా బుజ్జగించడానికి నా బాతు బచ్చాలు రెడీగా ఉంటారు. సో, అదన్నమాట! తప్పుడు సమాచారం కంటే అసలు సమాచారం లేకపోవడమే మంచిదని, జన్మలో మళ్లీ న్యూస్ చానల్స్ చూడొద్దని నిర్ణయించుకున్నా. అందువల్ల కరంట్ అఫ్ఫైర్స్ లో మనం కొంచెం వీకు. ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం!

ఇక ఆ సంఘటన గురించి..

దీనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను, భాదపడుతున్నా, అసలు మన సమాజంలో ఇలాంటి నీచులు ఉన్నారా! అనే రొటీన్ డైలాగులు నేను చెప్పను.

ఆ అమ్మాయి రాసిన దాన్లోంచి ఒక ముక్క మీ కోసం 

All that matters is that the girl’s screams and struggling give him a high. Isn’t that what it’s all about? The feeling of power.

పూర్తిగా చదవాలనుకునే వాళ్ళ కోసం ఈ లింక్ 

ఇది చదివాక, ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఆక్రోశిస్తోంది, "అసలేంటి... ఏం జరిగింది, నాకు తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి!" అనుకొని యూటూబ్ లో వీడియో చూసా అంతే దిమ్మ తిరిగింది, చెపితే నమ్మరు కానీ నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే "భయం". తోబుట్టువులున్న ప్రతీ ఒక్కడు అది చూసాక భయపడి తీరుతాడు.

నా కర్మ కొద్దీ ఆ వీడియో న్యూస్ చానల్స్ వాళ్ళు కవర్ చేసింది, వాళ్ళ సొల్లు వాళ్ళది. పోలీసులు ఏం చేస్తున్నారు, మహిళా సంఘాలు ఏం చేసాయి, NGO వాళ్ళు ఎలా ఊర్కున్నారు. ఎంతసేపూ వాడేం పీకాడు, వీడేం పీకాడు అనే కాని మనం ఏం ఈకాం అని ఎవడూ అనడు. విపక్ష నాయకులు అయితే ఇది ప్రభుత్వ వైఫల్యం దీనికి ఒబామా వెంటనే రాజీనామా చేయాలి అని, నిరసనగా బంద్ కూడా !! 

పనికొచ్చేది మాట్లాడేవాళ్ళే కరువయ్యారు ఈ రోజుల్లో! ఓకే వాళ్ళను అరెస్ట్ చేద్దాం ఉరి శిక్షా వేద్దాం కానీ ఇలాంటిది మళ్ళీ జరగదంటారా ? ఎహే మనకెందుకొచ్చిన గోల, మన దగ్గర జరగలే కదా! అనుకుందామా ? మీక్కూడా తెలుసు ఇలాంటివి జరగడానికి ప్లేసులతో సంబంధం లేదని.

అసలు ఎవరు వీళ్ళు, ఇంత దారుణంగా ప్రవర్తించడానికి వీళ్ళకు మనసెలా ఒప్పింది, వీళ్ళేమయినా దుశ్శాసుని కసిన్ బ్రదర్సా అంటే కాదనే చెప్పాలి. 

దీన్లోకి వెళ్ళే ముందు నా చిన్నపుడు మా నానమ్మ చెప్పిన కథ  - 

ఒక రాజు స్వయంవరానికి వెళ్ళి గెలిచి, రాణిని ఇంటికి తీసుకొస్తాడు. హారతి ఇవ్వకుండా లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి బయట ఉండి "అమ్మా! నేను ఏం తెచ్చానో చూడు" అంటడు. దానికి " ఏం తెచ్చినా సరే, మిగతా నీ నలుగురు అన్నదమ్ములతో పంచుకో" అంటుంది వాళ్ళ అమ్మ. 

మీకు సిన్మా అర్ధమయిందని నాకు తెల్సు, ఇంక నేను స్టోరీ జెప్ప....

అయితే, అప్పుడు వాళ్ళు అమ్మ మాట జవదాటలేదు కాబట్టి హీరోలు అని చెప్పారు కానీ తీసుకొచ్చింది కూడా ఒక ఆడదే, ఆమెను అలా పంచుకోవడం కరెక్టేనా అని ఎవరూ చెప్పరు. దానికి తోడు భార్య, భర్త మాట జవదాటకూడదు అనే జస్టిఫికేషన్ లు బోలెడు (పైగా, మన ద్రుపది పతివ్రతాయే...!!!). అన్ని స్టోరీలు మగవాళ్ళకు అనుకూలంగా రాసుకొని, ఆడవాళ్ళని తక్కువ అని చెప్పుకొనే మన సమాజం లో....

ఆగండి, ఆగండి మీకు నన్ను విమర్శించడానికి ఇంకా చాలా టైం ఉంది. అసలు చీర లాగే కార్యక్రమం గురించి నేను మాట్లాడనేలేదు సుమీ !



స్త్రీ స్వేచ్ఛ అని మొత్తుకున్న మహానుభావులు చలం, కందుకూరి లాంటి వాళ్ళు లేకపోలేరు కానీ వినేవాళ్ళు ఎక్కడ? నర నరాల్లో ఆడది తక్కువ అని నూరిపోస్తుంటే.. (ఆగు బదరూ పూర్తిగా చదివి నీ కామెంట్లు వేస్కుందువు గాని...)

బాక్ టు ద పవిలియన్, అసలు ఎవరు వీళ్ళు...

వీళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడలా, మన సమాజంలోని వాళ్ళే, మన కుటుంబ వ్యవస్థ నుండి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కడూ సాధారణ వ్యక్తి లాగానే ఉన్నాడు. కావాలంటే మీరూ చూడండి, ఎవ్వడికీ కొమ్ములు లేవు. (గమనిక: సున్నిత మనస్కులు ఆ వీడియో చూడకపోవడమే మంచిది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ఈ ఉత్తర్వు జారీ చేయడమైంది.)

ఇంతకీ నేను చెప్పోచ్చింది ఏంటంటే,

మన ఇళ్ళల్లో చూపించే gender discrimination మరియు రాణి రుద్రమ్మలు ఈ రోజుల్లో తగ్గిపోవడం 
ఇలాంటి సంఘటనలకి కారణాలు అని నా ఉద్దేశం.

హే, రుద్రమ్మ అంటే ఇంకో ఇస్టోరి గుర్తోచింది... మీరు వద్దు మహాప్రభో అనుకున్నా పర్లేదు నేను చెప్తా !!

నా చిన్నప్పుడు మా ఊళ్ళో డాన్సు ప్రోగ్రాంలు జరుగుతుండేవి, నేనూ వెళ్ళేవాణ్ణి (మా నాన్నగారు ఇంట్లో లేనపుడు). 
ఒకసారి, ఒక అమ్మాయి డాన్సు వేస్తోంది పాట గుర్తు లేదు కానీ అది "అ అంటే అమలాపురం" టైపు పాట. ఇంతలో 
నా పక్కనున్న ఒకడు ఆ అమ్మాయిపై ఒక బీప్ బీప్ కామెంట్ వేసాడు. ఆ పక్కనున్న ఆవిడ అది విని
"ఒరేయ్ బీప్ గా, నువ్ అన్నట్టే నీ అక్కా చెల్లెళ్ళపై వేరే వాళ్ళు కూడా ఇలానే కామెంట్ లు వేస్తార్రా!" అంది. 

(ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు
1. అసలు ఆ అమ్మాయిని అలాంటి పాటకి డాన్సు వేయమని ఎవడు అన్నాడు అనే టైపు 
2. ఇది కొంచెం వెరైటీ టైపు "అసలు ఆ కుర్రాడు ఏం కామెంట్ వేసి ఉంటాడు" అని బుర్ర బద్దలు కొట్టుకొనే వాళ్ళు 
ఈ రెంటినీ, కర్మ రా బాబు అని వదిలేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.)

అంతే వాడి మొహంలో నెత్తురుచుక్క కనపడలేదు, అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అపుడు ఆవిడని చూస్తే రుద్రమ్మని 
చూసినట్టు అనిపించింది. ఆమె అలా అనడం వల్ల వాడు మారాడని నేను చెప్పట్లా, నాలాంటి వాడికి జీవితాంతం 
వెన్నులో వణుకు ఉండేలా చేయగలరు ఇలాంటి వాళ్ళు అని నేను చెప్పేది. అలాంటి వాళ్ళ అవసరం ఈ రోజుల్లో చాలా
ఉంది.

మై డియర్ మెన్, నేనేమి ఆడాళ్ళ తరుపు వకాల్తా పుచ్చుకోలేదు. చప్పట్లు ఒకే చేత్తో కొడతారని చెప్తే నేను కూడా
నమ్మను. ఇక్కడ కేవలం ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా, ఆ వీడియో చూస్తే మీకే అర్ధం అవుద్ది.
మీరు అనుకొనే వాటిపై కూడా చర్చిద్దాం (తర్వాత ఎప్పుడైనా), మనకు పండగే పండగ.

మళ్ళీ బాక్ టు ద పవిలియన్, ఎవరు వీళ్ళు...

ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు "మన ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు ఇలాంటి పని చేస్తే..?" (చెప్పలేం రోజులు అసలే బాలేవు)

చూశారా తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉందో... !! 


“Children are great imitators. So give them something great to imitate.” 
ఏమన్నా అర్ధం అయ్యిందా ? సంతోషం, అర్థం అవ్వకపోతే ఇంకా ఆనందం...

మనం మన ఇంట్లో మన ఆడాళ్ళపై ఎలా ప్రవర్తిస్తామో, మన పిల్లోడికి అదే మనం నేర్పినట్టు లెక్క. ఏదో ఒక బలహీన క్షణంలో మీ ఆవిడ పై చేయి చేస్కున్నారనుకోండి, తిరిగి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టకపోతే... ఇంకేం నాన్నే గ్రేట్, అంటే మగాళ్ళే గ్రేట్ అని వాడు ఫీల్ అవతాడు. ఇలాంటి బీప్ బీప్ గాళ్ళ లాగా అవడని గారంటీ లేదు. ఎందుకొచ్చిన రిస్క్ చెప్పండి. ఎప్పుడూ పుత్రోత్సాహం అని ఒకే ఆంగిల్ లో ఎన్ని రోజులు ఆలోచిస్తారు, పుత్రికోత్సాహం అనేది కూడా ఒకటి ఉంటదని నమ్మండి.

ఇంక ఈ అమ్మాయిలు-అమ్మమ్మల విషయానికొస్తే, వీళ్ళకి ఏమీ జరగనట్టు పోవడం ఉగ్గు పాలతో పెట్టిన విధ్య. ఎవడేమన్నా లైట్ తీస్కుంటారు. నేనేమీ మిమ్మల్ని కత్తులు గట్రా వేస్కొని రోడ్ల పై పడమని చెప్పట్లేదు, టెన్షన్ పడకండి. మీ ఇంట్లో పిల్లాడు పిల్లదానిపై పెత్తనం చలాయిస్తుంటే వాడి చెంపపై లాగి ఒక్కటి పీకి "దేంట్లోరా నువ్ దానికంటే ఎక్కువ" అనండి చాలు.

ఇంక చివరగా శ్రోతల కోరిక మేరకు ఒక పాట...

Respect (పాట యూటూబ్ లో)

ఇంత సొల్లు చదివాక మీకేమైనా తేడా అనిపిస్తే సంతోషం. లేదంటే, మనం ఎన్ని విషయాల్ని లైట్ తీస్కోలేదు ఇదో లెక్కా? అసలే మనం భారతీయులం, లైట్ తీస్కోడం మన జన్మ హక్కు !!!

ఇంక విమర్శకులూ మీరు కుమ్మేస్కోండి....

జీవితం


జీవితం, మొదలు పెడతానో లేదో "ఒరేయ్ నీ ఎంకమ్మ, టెంక పగులుద్ది" అని ఆత్మారాముడు ఘోషిస్తాడు.

చాలా రోజులు ఆలోచించినా తట్టని విషయం పెడేల్మని కొట్టినట్టు, మాటల మద్యలో నా బాతు బచ్చాగాడు  రెండు ముక్కల్లో నిర్వచించేసాడు. 'అమ్మ నీ' అనుకోవడం తప్పలేదు, తందాన తాన అని కూడా అనేశా !

జీవితం - ఇది చాలా కొద్ది మందికే అర్ధమైన విషయం (నాకు అర్దమైంది అని చెప్పటానికి మాత్రం ట్రై చెయ్యట్లేదు ఇక్కడ). ఇంతకీ మావోడు చెప్పింది ఏటంటే "మన కోసం ఒకరు త్యాగాలు చేయడం, మనం మరొకరి కోసం త్యాగాలు చేయడం".

ఎంత ఆలోచించినా, ఎన్ని పేజీలు తిరగేసినా, ఎన్ని లెక్కలు వేసుకున్నా ఇంతేనేమో అనిపిస్తది.

ఇపుడు నా వెర్షన్...

త్యాగం సంతోషమైనా, సంతోషం త్యాగమైనా పెద్ద తేడా లేదు మన యాంత్రికజీవనం లో..!

జీవితం గురించి పక్కన పెడితే, జీవితంలో గోల్స్ పైనే నా concentration ఎక్కువ అని చెప్పొచ్చు. అదేటంటే Happyness. దీన్ని జీవితంలో ఒక గోల్ గా మలచుకున్న నాలాంటి వెర్రివాళ్ళు పపంచకంలో చాలామందే ఉన్నారు.
   అసలు మనిషి సంఘజీవి కాకుండా ఉంటే ఇలాంటి గోల్స్ పెట్టుకొనే దుర్భాగ్యం వచ్చేది కాదేమో. ఎందుకంటే వాడికి  ఏది అవసరమో, అనవసరమో తెలుసు. ఈ రూల్స్, రేగ్యులషన్స్ కి తల వంచినపుడు తన హాపినెస్ ని త్యాగం చేయాల్సిన పరిస్థితి. పద్ధతులు, కట్టుబాట్లు లేనపుడు మనిషి జీవన మనుగడకి అర్ధం ఉండదు, అసాధ్యం అని చెప్పే మహాశయులు చాలా మందే ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే "అయ్యా! పద్దతులు పుట్టాక మనుషులు పుట్టారని మీ భావన, మనుషులు పుట్టాక పద్దతులోచ్చాయని నా అభిప్రాయం".
ఈ పద్ధతులు, కట్టుబాట్లు లేకపోతే జీవన మనుగడ అసాధ్యమేమో అనిపించొచ్చు ఎందుకంటే బలవంతుల రాజ్యమే నడిచేది, బలహీనుల పరిస్థితి దారుణం అయ్యేది. అయినా ఇపుడు మాత్రం ఒరిగిందేముంది, బలహీనులపై బలవంతుడు ఆధిపత్యం చలాయిస్తూనే ఉన్నాడు. చరిత్ర మొదలయినప్పటినించి ఇప్పటివరకూ, కాకపోతే చట్టాలు న్యాయాలు అనే ముసుగులో. ఈ ముసుగులే లేకపోతే ప్రతీ ఒక్కడు బలవంతుడయ్యేవాడు. పద్దతులు, కట్టుబాట్ల విషయానికొస్తే అసలు ఆదిలోనే తప్పటడుగులు వేశాం కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ తప్పతడుగుల్ని సరిదిద్దే కార్యక్రమం ఎవడూ చేయలేదు.
   ఛస్! ఎలాగూ మనం సంఘజీవులం, జంతువులం కాబట్టి కట్టుబాట్లు ఉండాల్సిందే నహే, కానీ ఈ కట్టుబాట్లు ఒకరు మరొకరిపై రుద్దినట్టు ఉండకూడదు. ఈ రుద్ది నట్టు, బోల్టు ల గొడవల్లో పడి టైం కూడా చూస్కోలేదు. ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వచ్చేశా, రాసింది నాల్గు లైనులు కాని మహాభారతం రాసిన ఫీలింగ్ వచ్చేసింది, ఈ కన్వర్టర్ ఉపయోగించి తెలుగులో రాయడం కష్టమే సుమీ...! ఉండండి, ఆపిల్ వాడికి మెయిల్ పెట్టి వస్తా !

వెళ్తూ వెళ్తు చివరగా,

    యే సొసైటీ అయితే Individual Rights ని స్వీకరించి గౌరవిస్తుందో అక్కడ ప్రతి Individual సొసైటీ Rights ని తనవిగా భావిస్తాడు.