Sunday 23 September 2012

ఆనందం

ఎక్కడెక్కడ వెతికినా దొరకట్లేదు, ఎన్ని విధాల ప్రయత్నించినా అందట్లేదు, ఎలా ఆలోచించినా తట్టట్లేదు.

'ఇసుకను పిండి నూనె తీయొచ్చు' అని ఎప్పుడో చిన్నపుడు చదివిన పద్యం ఎన్నిసార్లు గుర్తొచ్చినా, ఆత్మారాముడు మాత్రం 'ఇహ మన వల్ల కాదుకని లైట్ తీస్కుందాం' అని చెప్పడం మొదలెట్టి చాలా రోజులైంది. ఇంతదాకా వచ్చింతర్వాత ఇక ఒదిలి పెట్టేది లేదు అని నచ్చజప్తూనే ఉన్నా, వాడు మేల్కొన్నప్పుడల్లా. ఇంకొన్ని రోజులు పోతే వాడి మాటే వినాల్సి వస్తదేమో అనే భయమూ తరుముతోంది. మనవల్ల కానప్పుడు పెద్దల సలహా తీస్కోడం మంచిదేమో అనే ఆలోచనా వచ్చింది కానీ ఎపుడు మనకి నచ్చిందే చేసే అలవాటుని నొప్పించిన వాణ్ని అవుతానేమో అనే ఒక సంకోచం. ఇప్పటికే ఓపిక పీక్స్ దాటుకెళ్ళింది, ఎలా జరగాల్సింది అలా జరుగుద్ది. ఆ పై ఫ్లాట్ లో అశోగ్గాడు ఎలాగూ ఉన్నాడు, మనం నిమిత్త మాత్రులం అనుకొని ఎవరైనా పూజ్యులు, గౌరవనీయుల శరణు కోరదాం అని డిసైడయ్యా. ఇక్కడే వచ్చింది చిక్కు, అలాంటోడు ఒకడూ దొరకందే. హతవిధీ! మళ్ళీ మొదటికొచ్చింది.

హఠాత్తుగా ఒక రోజు ఈ ప్రశ్నకి సమాధానం దొరికినట్టనిపించింది, 

ఆ రోజు శుక్రవారం.. ఉదయాన్నే సూర్యుడు తెల్లగా, మబ్బుల చాటున దాక్కున్నాడు, జ్యోత్స్నను పోలిన వెలుతురు, ధాత్రి తో దోబూచులాడుతూ! ఈ వియోగ భారం ఇక తనోపలేనని మేఘాలపై కన్నెర్ర జేసినట్టుంది, మేఘాల గమనం వేగవంతమైంది, అపుడు సోకిన మయూఖపు నుని వెచ్చని స్పర్శతో తను పులకరించింది. వెంటనే చెట్టుపై ఉన్న కోయిల తన గానం తో ధాత్రీ, వెలుగు రేడు ల సంయోగాన్ని మరింత పావనం చేసింది. 

మీరు ఎక్కడికో పోతున్నట్టున్నారు, మనం మేటర్ లోకి వద్దాం. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, అమ్మ టీవీ లో ఏదో భక్తి ఛానల్ చూస్తోంది. పల్లూడగోట్టుకోడానికి ఏ రాయి అయితేనేం, కాసేపు చూద్దామని కూర్చున్నా, ఏదో ఆశ్రమం గురించి చెప్తున్నారు. ఇదేదో మన సిచువేషన్ కి పనికొచ్చేదున్నట్టుంది అని అడ్రస్ రాస్కుంటుంటే అమ్మ వింతగా చూస్తోంది. బహుశా నాలో సన్యాసి కనపడ్డాడేమో, అలాటిదేమి లేదని నచ్చజెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.

ఇక ఆ ఆదివారం బయల్దేరా, ఫ్రెండ్సుకి చెపితే మొదటికే తేడా వస్తదని చుట్టాల దగ్గరికి అని వాళ్ళకి మస్కా కొట్టి, ఆశ్రమానికి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరం, రా రమ్మన్నట్టుగా. ఆహా! ప్లాస్టిక్ తొట్టి, ప్లాస్టిక్ కుండ, ప్లాస్టిక్ అదీ... ప్లాస్టిక్ ఇదీ.. కాదేది ప్లాస్టిక్ కి అనర్హం అనే విధంగా... ఈ రోజుల్లో మహర్షులుంటే ప్లాస్టిక్ కమండలాలు వాడే వారు కామోసు...!!

వెతగ్గా వెతగ్గా ఒక చెట్టుకింద ధ్యానం చేస్తూ ఒక సాధువు కనపడ్డాడు, అర మీటరు గెడ్డం వేసుకొని. అబ్బో ఈయన మాంచి సహనశీలి, విజ్ఞుడేమో అనుకొని (రెండోది కొంచెం డౌటే కానీ మొదటిది నిజమేనేమో, రెండు సెం.మీ. గెడ్డం పెరిగితేనే చిరాకేస్తది. అలాంటిది అర మీటరు గెడ్డం... మాటలు కాదు సుమీ!) వెళ్లి ఆయన ముందు నించున్నా, ఎపుడు కళ్ళు తెరుస్తడా అని. ఒక అరగంట నిరీక్షణ, ఈయన్ని చూస్తుంటే మన రమణారెడ్డి నే గుర్తుకొచ్చాడు. ఎందుకో తెలియదు దొంగ సాములంటే రేలంగి మంచి సాములంటే రమణారెడ్డి నే గుర్తొస్తారు. (నిత్యానందుని చూస్తే రంజిత గుర్తోస్తదనుకోండి అది వేరే విషయం) 

ఈ తర్క విశ్లేషణ లో ఉండగా ఆయన కళ్ళు తెరిచారు. వెంటనే నేను 'పాహిమాం పాహిమాం !! రక్ష రక్ష' అనేశా వర్డ్స్ రిచ్ గా ఉండాలని నిన్నటి నుండి ప్రాక్టిస్ చేశా మరి, ఆయనేమో ఏమీ అర్ధం కానట్టు 'What do you want, భక్తా' అనేశాడు, ఇంగ్లీషు మీడియం సామి అనుకుంటా. వెంటనే ఏం కావాలో చెప్తే బాగోదని, ఆశ్రమం గురించి ఎలా తెలిసింది ఏ రూట్ లో వచ్చానో చెప్తూ ఉంటే. అవేమి వద్దని ఎందుకొచ్చానో చెప్పమన్నాడు, సామి బాగా బిజీ అనుకుంటా. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని 'Happiness, స్వామి' అనేశా. దానికి ఆయన చిన్నగా నవ్వి ఊర్కున్నాడు, ఏమీ చెప్పకపోయే సరికి నాలో టెన్షన్  మరింత పెరిగింది. ఆయన కాసేపటి తర్వాత 
'There's no such thing as a free lunch, నాయన' అన్నాడు.  
అబ్బో ఈడు మన టైపే ఫ్రీ గా ఏది చేసేట్టు లేడు అంటే సొల్లు చెప్పకుండా ఏదో పనికొచ్చేదే చెప్తాడు. 
'What I have to do for that, స్వామి'
'You need to count the number of leaves this tree has'
'....'
ఇంకేం చచ్చింది గొర్రె, మన వాలకం చూసి మేష్టారుకి అర్దమైంది.
'Otherwise you can pay 5011 Rs as ashrama development fund'

(అవును మరి, మనకు ప్రతి దానిలో డిస్కౌంట్ దొరుకుద్ది. ఇది చేయలేని వాళ్ళు అది చెయ్యొచ్చు, అది చేయలేని వాళ్ళు మరొకటి చెయ్యొచ్చు. ఎన్ని పాపాలు చేసినా ఒకసారి గంగలో మునిగితే చాలు, మళ్ళీ ఫ్రెష్షుగా పాపాలు చేయడం మొదలెట్టొచ్చు.)

ఇంక, నా మొహం లో వెలుగు చూడలేక అయన కళ్ళకి చేతులని అడ్డుపెట్టుకోవలసి వచ్చింది.
'Get me the receipt and I'll give you my wisdom'
వెంటనే లగేత్తుకెళ్ళి, receipt తో ఆయన ముందు నించున్న. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు
'What do you want ?'

'I want happiness'

'Remove I from that, what are you left with ?'

'want happiness'

'Remove want from that, what are you left with ?'

'Happiness'

'that's all my son, You can't take anything with you when you die. Help others like a tree, river then you will find peace in your heart!!'


(చెట్టు, నది గురించి ఏదో శ్లోకం కూడా చెప్పాడు, మనమేమి ఏకసంథాగ్రహులమా గుర్తు ఉండడానికి..?)
ఇహ నాకు కన్నీళ్ళు ఒకటే తక్కువ ఎంత సింపుల్ గా చెప్పేశాడు సామి, అంత గొప్ప విషయాన్ని. ఆయనకు నమస్కరించి ఇంటి దారి పట్టా, సిద్దార్థ నుండి బుద్దుడిగా మారిన ఫీలింగ్ లో...


ఇక్కడ కట్ చేస్తే, మూడు నెలలు గిర్రున తిరిగాయ్.. 

ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం...


మళ్ళీ అదే ఆశ్రమంలోకి అడుగు పెట్టా కాకపోతే నా గెడ్డం 2 సెం.మీ.ల నుండి 2 ఇంచులకి పెరిగింది. ఈసారి నేరుగా ఆ చెట్టు దగ్గరికే వెళ్ళా, సామి అక్కడే ఉన్నాడు ధ్యానంలో. 

అయన లేచేసరికి ఈసారి టైం ఎక్కువే పట్టింది, లేచి నన్ను ఎగాదిగా చూసి 'వాట్ డు యు వాంట్' అన్నాడు మళ్ళీ.
అమ్మ దీనమ్మోయ్, చూసిన సినిమా ఎన్ని సార్లు చుపెడుతావురా నాయన ! అసలే చిరాకెత్తి ఉన్నా.

'డోంట్ యు రెమెంబెర్ మి స్వామి, ఐ వస్ హియర్ త్రీ మొంథ్స్ బ్యాక్'

'ఐ డోంట్, టెల్ మి వాట్ డు యు వాంట్'

అంతే ఇక నాకు ఎక్కడో కాలింది, ఆవేశం కట్టలు తెంచుకుంది. చిన్నప్పటి నుండి విన్న బూతులన్నీ మెదడులో మెదిలాయి.

'నేను తెల్వదా, నీ డాడీ... బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....బీప్....
'ఆగు నాయనా ఏమిటా తిట్లు, వినలేకున్నా. దైవాంశ సంభూతులను అల తూలనాడడం అమంగళం'
'జఫ్ఫానా జఫడి, ఎందుకు తిట్టొద్దు, ఎట్లా మర్చిపోతావ్ నన్ను! వచ్చీ రాని సోల్లంతా జెప్పి... ఆగాగు... హమ్మ, రాజబాబు రేలంగి. నీకు తెలుగొచ్చా. నీ బీప్....బీప్....బీప్....బీప్....బీప్....'
'ఆగు నాయనా నేను ఒరిజినల్ స్వామినే, అందులో యే సందేహమూ వలదు. నిరూపించడానికి మా గురువు గారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది. పరీక్షించడానికి గెడ్డం పీకాలని మాత్రం చూడకు నాయన, దీని భాద ఇప్పటికే భరించలేకున్నా'
'మరి ఎందుకా ఇంగ్లీషు కటింగులు ఇచ్చావ్ ? తెలుగులోనే ఎందుకు మాటాడలే ?'
'ఏం చెప్పమంటావ్ నాయన, ఈ రోజుల్లో తెలుగు ఎవరికి వొచ్చు. అన్నీ ఇంగ్లీషు మీడియం బాచులే, ఇంగ్లీషు మాట్లాడే స్వాములకు శిష్యుల ఫాలోయింగ్ ఎక్కువ అని ఈ మధ్యే స్పోకెన్ ఇంగ్లీషు ట్యూషన్ జాయిన్ అయ్యా! కెరీర్ లో ఎదగాలంటే ఇప్పుడు ఇంగ్లీషు మస్ట్ కదా!!'
'హుం, మీక్కూడా ఈ భాద తప్పలేదా'
'ఏం చేస్తాం నాయనా, ఇంతకీ నువ్ మళ్ళీ ఎందుకొచ్చినట్టు. ఏమయ్యింది, సంతోషం దొరికిందా..?'
'పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. అంతక ముందర ఉన్న మనశ్శాంతి కూడా లేకుండా పోయింది.'
'జయమాలిని డాన్సులా కాకుండా, అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు నాయనా'
'హా, ఏం చెప్పమంటావ్. మీరు చెప్పినట్టే పరుల హితం కోసం బ్రతికేద్దాం అనుకోని, అందరికీ హెల్ప్ చేస్కుంటూ ఈజీగా లైఫ్ గడిపెయ్యోచ్చు అనుకున్నా. అక్కడే మొదలైంది అసలు సినిమా; ఎవడు డబ్బులు అడిగినా లేదనకుండా, నాదగ్గర లేకున్నా వాళ్ళకి సర్దుబాటు చేశా. దాని వల్ల నాకు ఇప్పటికి మిగిలింది 10 లక్షల అప్పు. మా ఆఫీసులో పనంతా నేనొక్కడినే చేస్తున్నా, ఎవడికీ నో చెప్పలేకపోయేసరికి. రోజుకి 4 గంటలు పడుకోవడం కూడా గగనం అయిపోయింది. ఆమధ్య వరుసగా వారం రోజులు ఆఫీసులోనే పడుకున్నా. ఇంట్లో కాసేపు టీవీ చుద్దామంటే, మా అమ్మ టీవీకి తాళం వేస్కుంది. మళ్ళీ ఏ అఘాయిత్యం చేస్తానో అని. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడ మిస్టేక్ చేశానో'
'అయ్యో నాయన, పరుల కోసం బ్రతకమంటే నీకోసం ఏమీ లేకుండా చేస్కోవడమేనా ?'
'నీ డాడీ! ఎవడు రా రిమూవ్ ఐ అని చెప్పింది, నీ బీప్....బీప్....బీప్....బీప్....'
........................
పాపం, సామికి ఏమనాలో తెలియలా. అలా చూస్తూ నించున్నాడు. నాకే అదోలా అనిపించి
'సారీ స్వామి, ఏదో ఫ్రస్ట్రెషన్ లో. అసలు నాకే తెలియాలి, ఏదో మీకు తెలిసింది చెప్పారు. రిమూవ్ ఐ అన్నప్పుడు, నన్ను తీసేస్తే - నేనే లేనప్పుడు ఆ సంతోషం ఎవడు తీస్కుంటాడు అనే ఆలోచనే నాకు రాలేదు చూడు. అది నా తప్పే. ఎవరికీ తోచింది వాళ్ళు చెప్తారు కానీ మన జీవితంలో మనకి ఏది అవసరమో నిర్ణయం మనదేగా, గుడ్డిగా నమ్మి చేస్తే ఇలానే ఉంటది లెండి.'
సామి రియాక్షన్ ఏదో తేడాగా అనిపించింది. ఏదో చెప్దామనుకున్నట్టు, కానీ ఆగిపోయాడు. మళ్ళీ తిట్లు వినే ఓపిక లేదనుకుంటా. ఇహ అక్కడ చేసేదేమీ లేదని బయటికి వచ్చేసా.

జీవితం మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలానే టైం పట్టింది. అలవాటు పడ్డ జీవులు ఇప్పటికీ వెంట పడుతూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒక రోజు కాఫీ మిషన్ దగ్గర వెలిగింది లైటు, ఇంచుమించుగా జ్ఞానోదయమే. రెండు రోజులుగా ఎంత ట్రై చేసినా సాల్వ్ కాని ప్రాబ్లం, ఎలా చేయాలో తట్టింది. అపుడు ఆ క్షణం, మేఘాల్లో తేలిపోవడం అంటే ఏవిటో అర్ధమయింది.

యురేకా ! నేను కనుక్కున్నా ఆనందానికి కీ.

వినాలని మీకూ ఉందా, అయితే కాస్కోండి.
నువ్వు ఎంత కష్టపడతావో అంత సంతోషం నీకు దొరుకుతది. నమ్మరా ? అయితే మీకు ప్రాక్టికల్స్ అవసరమే.

మీరు ఒక లైన్ లో నించున్నారు, మీ నంబర్ రావడానికి చాలా టైం ఉంది. సడన్ గా మీకు చెప్పుకోలేని చోట దురద పుట్టింది. హ హ హ. అపుడు ఉంటది మీ భాద. ఎలాగోలా ఇంటికి వచ్చో లేక వాష్ రూం కి వెల్లో, మీ పని మీరు కానించినపుడు... అపుడు.... మీ ఆనందం వర్ణనాతీతం. కాదంటారా?

అంటే దురద లేనిది ఆనందం లేదన్నమాట. అయ్యబాబోయ్ నాకేటిది ఫిలాసపీ ఇంత ఒత్తుగా వచ్చేస్తోంది.

కొంతమంది, మేము ఎంత కష్టపడ్డా జీవితానికి సుఖం లేకుండా పోతోంది అని చెప్పే వాళ్ళూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏటంటే
Contradictions do not exist. Whenever you think you are facing a contradiction, check your premises. You will find that one of them is wrong.

అంటే, మీరు మీకు నచ్చినది కాకుండా ఏదో చేస్తే ఎట్టా దొరుకుద్ది ఆనందం?

కొంతమంది మహానుభావులు ఉంటారు, మాకు నచ్చినది చేసినా దొరకట్లే అనే వారు.

అన్నయ్యా, మీకు నచ్చిన హీరోయిన్ నడుము చూసినప్పుడు మాత్రం దొరుకుద్ది కానీ. నచ్చిన పని చేస్తే దొరకదా ? అంటే మీ జీన్స్ లోనే ఏదో తేడా ఉంది, బేసిగ్గా మీది వొళ్లు వంచే తత్వం కాదు. రజినీకాంత్ కూడా చేతులు ఎత్తేస్తాడు మీ విషయంలో, ఇంక నేనెంత.

నాకు తెలిసినంతవరకి ఆనందం కంప్లీట్ గా సెల్ఫిష్ ఫీలింగ్. కాదనేవాడు ఎక్కడైనా పోనీ.

నాది అనుకున్నపుడే దొరికేది సంతోషం. ఉదాహరణగా, అందరికీ తెలిసింది మాటాడుదాం. క్రికెట్ లో ఇండియా గెలిస్తే ఎగిరి గెంతేస్తావే (చూసేవాళ్ళకి వర్తిస్తది), నాది అనే ఫీలింగ్ లేనిదే వొచ్చిందా అది?

ఇంకా ఇలాటివి చాలానే ఉన్నాయి కానీ ఇప్పటికి చాలు, చాలా అయింది నా సొల్లు.


సో, అదన్నమాట. ఇంక ఉంటా, ఆత్మారాముడు ఏదో చెప్పాలని గోల చేస్తున్నాడు.

No comments:

Post a Comment